- చివరిసారిగా 1984లో తెరుచుకున్న ఖజానా
- ఓ గదిలో నుంచి పాములు బసకొట్టిన శబ్దాలు
- మధ్యలోనే లెక్కింపును నిలిపివేసిన అధికారులు
ప్రముఖ శ్రీక్షేత్రం జగన్నాథ ఆలయంలోనూ అపార సంపదలు ఉన్నాయని నమ్ముతారు. ఆలయంలోని రత్నభాండాగారంలో అంతుచిక్కని నిధినిక్షేపాలు ఉన్నట్టు సమాచారం. అయితే, 40 ఏళ్లుగా రత్నభాండాగారం తెరవలేదు. కానీ, ఎట్టకేలకు భక్తుల నిరీక్షణకు తెరపడింది. జులై 7 తర్వాత స్వామివారి ఆలయంలోని ఈ ఖజానాను తెరవనున్నట్టు పురావస్తుశాఖ (ఏఎస్ఐ) బుధవారం ప్రకటించింది. లోపల మరమ్మత్తులు చేపడతామని వెల్లడించింది. ఇక, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒడిశాలో మొదటిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాల తెరిచి భక్తులను అనుమతించింది. తాజాగా, రత్నభాండాగారంపై ఒడిశా సర్కారు దృష్టిసారించింది.
జగన్నాథ ఆలయ అనువంశిక ధర్మకర్త పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ అధ్యక్షతన బుధవారం పాలకవర్గం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో రత్నాభాండాగార తెరిచే అంశంపై ప్రస్తావన రాలేదు. కానీ, పాలకమండలి భేటీ అనంతరం ఏఎస్ఐ సూపరింటెండెంట్ డీబీ గడనాయక్ మీడియాకు ఈ విషయాన్ని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే రథయాత్ర మర్నాడు జులై 8న ఆలయ ఖజానా తలుపులు తెరిచి మరమ్మతులు చేపడతామని ఆయన తెలిపారు. ఐదేళ్ల కిందట 2019 ఫిబ్రవరి 4న నిపుణుల కమిటీ రత్నభాండాగారం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది. తాళం చెవి కనిపించకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది.
వెలుపల నుంచే పరిశీలించిన కమిటీ సభ్యులు.. గోడలు, పైకప్పు బలహీనంగా మారి, పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించింది. అనంతరం ఏఎస్ఐ అధికారులు లేజర్ స్కానింగ్ ద్వారా దీనిని ధ్రువీకరించారు. ప్రస్తుత మరమ్మతులు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్కమిటీ, సాంకేతిక నిపుణుల సూచనల మేరకు జరుగుతాయని ఆయన వివరించారు. అయితే, ఎన్ని రోజుల్లో ఇది పూర్తవుతుందనేది మాత్రం ఏఎస్ఐ అధికారి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు, స్వామివారి ఆభరణాల లెక్కింపు అంశంపైనా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కాగా, చివరిసారిగా ఆలయ రత్నాభాండాగారాన్ని 1976లో తెరిచి ఆభరణాల లెక్కించి, వాటి వివరాలను రికార్డుల్లో భద్రపర్చారు. అయితే, జగన్నాథ ఆలయంలోని 7 గదుల్లో విలువైన ఆభరణాలు, వజ్రవైడూర్యాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాలుగా అనేక మంది రాజులు, భక్తులు స్వామివారికి భక్తితో సమర్పించిన ఈ కానుకలను ఒక్కసారి లెక్కించి, తిరిగి భద్రపరచాలని 1984లో అప్పటి ఆలయ అధికారులు భావించారు. ఇందులో భాగంగా మొదటి మూడు గదులను తెరచి సంపదను లెక్కించి, తర్వాత నాలుగో గది దగ్గరకు వచ్చేసరికి అక్కడ నుంచి సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. దీంతో మిగతా గదులను తెరవకుండా లెక్కింపును నిలిపివేశారు. అప్పడు మూసిన తలుపులు ఇప్పటి వరకూ తెరవలేదు. అంశం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా 2000 నుంచి అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం స్పందించలేదు.