×

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. రూ.300 దర్శన టికెట్లు, బుక్ చేస్కోండి!

టీటీడీ ప్రతి నెలా దర్శనం, సేవలు, అంగ ప్రదక్షిణలు సహా అన్ని రకాల ఆన్‌లైన్ టికెట్లకు సంబంధించి షెడ్యూల్ ఇస్తోంది. నవంబర్ నెలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పటికే ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయగా.. వర్చువల్ సేవా టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు. అలాగే వసతి గదులు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను సైతం విడుదల చేయనుంది టీటీడీ.

టీటీడీ నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవ టికెట్లు, వసతి గదుల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం న‌వంబ‌రు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా వివరాలను వెల్లడించింది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ.300 టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగ‌స్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.

మరోవైపు వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను ఇవాళ (ఆగ‌స్టు 22) మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆగ‌స్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ ఆగ‌స్టు 25వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

  • August 22 , 2023
  • 10:36 am