×

ఘోర విపత్తు.. బతుకులు శిథిలం.. 20 వేలమంది దాకా మృతి??

అంతర్జాతీయా న్యూస్ ( లలితా పీఠం ) : టర్కీ, సిరియాల్లో సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేటమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటిదాకా మృతుల సంఖ్య 7,800 దాటింది. ఒక్క తుర్కియేలోనే దాదాపు 6,000 పై చిలుకు భవనాలు కూలిపోయినట్లు నిర్ధారించారు. విపరీతమైన చలి వణికిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాలను తొలగించడం, వాటి కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. సోమవారం మూడు భారీ భూకంపాలు ఇరు దేశాలను కుదిపేయడం తెలిసిందే. అనంతరం ఇప్పటిదాకా కనీసం 200కు పైగా చిన్నా పెద్దా ప్రకంపనలు వణికించాయి. వాటి భయానికి భారీగా జనం ఇళ్లూ వాకిలీ వీడి వలస బాట పడుతున్నారు. 

అంతటా ఆర్తనాదాలే 
శిథిలాల కింది నుంచి బాధితుల ఆక్రందనలు హృదయవిదారకంగా వినిపిస్తున్నాయని భూకంపం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. ‘‘కానీ వారిని కాపాడుకొనే మార్గం కనిపించడం లేదు. కాంక్రీట్‌ స్లాబ్‌లను తొలగించే పరికరాలు మా దగ్గర లేవు. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జాప్యం జరిగితే బాధితులు చనిపోయే ప్రమాదముందంటున్నారు. తుర్కియేలోని హతాయ్‌ ప్రావిన్స్‌లో వేలాది మంది క్రీడా ప్రాంగణాలు, ఫంక్షన్‌ హాళ్లలో తలదాచుకున్నారు. సైన్యం రంగంలోకి దిగి టెంట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. షాపింగ్‌ మాల్స్, స్టేడియాలు, మసీదులు, కమ్యూనిటీ సెంటర్లలోనూ నిరాశ్రయులకు వసతి కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీరు అందజేస్తున్నాయి. భూకంప కేంద్రమైన గాజియాన్‌టెప్‌ నగరంలో పరిస్థితి భీతావహంగా మారింది. ఎటు చూసినా బాధితుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. 

ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. ఇప్పటికే అత్యవసర వైద్య బృందాలను ఆ దేశాలకు పంపినట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

  • February 09 , 2023
  • 09:40 am