వెస్ట్ బెంగాల్ ( లలితా పీఠం ) : కరోనా మహమ్మారి భయం నుంచి బయటపడుతున్నాం.. అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇంతలోనే మరో వైరస్ కలవరపెడుతోంది. కొద్ది రోజులుగా పశ్చిమబెంగాల్‌ను అడెనోవైరస్ టెన్షన్ పుట్టిస్తోంది. కొంతకాలంగా ఈ వైరస్ బారినపడిన చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అడెనోతో పెద్దలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. జనవరి నుంచి ఈ కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
అడెనో వైరస్ బారిన పడినవారిలో జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో పాటు నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ రోగులు దగ్గడం, తుమ్మడంతో పాటూ తాకడం వల్ల ఒకరిని నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందంటున్నారు. అడెనోవైరస్‌ను అంత తేలికగా తీసుకోకూడదంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు, శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారిపై ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందంటున్నారు.ఈ వైరస్ సోకిన వారికి ప్రత్యేకంగా ఎలాంటి ట్రీట్మెంట్ లేదంటున్నారు. లక్షణాలను బట్టి వైద్యం అందిస్తున్నారు. కొంతమంది పిల్లల్ని ఆస్పత్రిల్లోనే ఉంచి వైద్యం అందించాల్సిన పరిస్థితి ఉంది. కొందరికి ఆక్సిజన్ సపోర్ట్ కూడా కావాల్సి వస్తోంది. స్వాబ్ టెస్ట్ ద్వారా ఈ వైరస్‌ను గుర్తిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే మార్గమని వైద్యులు అంటున్నారు.
తరచూ చేతులు సబ్బు, నీళ్లతో కనీసం 20 సెకన్ల పాటూ శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లిన సమయంలో మాస్కులు ధరించాలంటున్నారు. అవనసరంగా ముక్కు, నోరు, కళ్లను తాకొద్దని.. కరచాలనాలు మంచిద కాదంటున్నారు. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలంటున్నారు. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే ఇంట్లోనే ఉండటం మంచిదంటున్నారు. మాస్క్ ధరించాలని.. దగ్గు, తుమ్మినప్పుడు మూతిని కవర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. దీంతో ప్రభుత్వ అమప్రత్తం అయ్యింది. అడెనోవైరస్ లక్షణాలు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పెద్దవారికి కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తత అవసరం అంటున్నారు. అడెనోవైరస్ భయం పశ్చిమ బెంగాల్ చుట్టుపక్కల రాష్ట్రాలను వెంటాడుతోంది. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండటంతో అందరిలో టెన్షన్ మొదలైంది. బెంగాల్‌లో ఒకటి రెండు మరణాలు సంభవించాయని ప్రచారం జరుగుతోంది.. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మొత్తానికి అడెనోవైరస్ గుబులురేపుతోంది.