దేశంలోని కోట్లాది మంది గ్రామీణ, పట్టణ ప్రజలు ఎన్ని బ్యాంకింగ్ సంస్థలు వచ్చినా ఇప్పటికీ వారు నమ్మేది పోస్టల్ స్వీసులనే. వారు తమ గ్రామాల్లోనే వీటిలో డబ్బును పొదుపుచేసుకోవటం నుంచి ఇన్సూరెన్స్ వంటి సేవల వరకు వీటి నుంచి పొందుతున్నారు. అయితే ఈ సారి స్కామర్లు పోస్టల్ వినియోగదారులను టార్గెట్ చేయటంతో చాలా మంది నష్టపోతున్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది..
మోసగాళ్లు ఇప్పటికే దేశంలో అనేక కొత్త పద్ధతులను వినియోగించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా వీరు ఇండియా పోస్ట్ పేరును పెద్ద స్థాయిలో మోసాలకు వినియోగించటం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్తరకం మోసంలో ముందుగా ఇండియా పోస్ట్ పేరుతో మోసగాళ్లు ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నారు. వారు ఆ మెసేజ్‌లో ఒక వెబ్ లింక్ పంపుతారు. మీకు పార్శిల్ డెలివరీ కోసం 48 గంటల్లో చిరునామాను ఇవ్వాలని మోసగాళ్లు సదరు మెసేజ్ ద్వారా అడుగుతున్నారు.