×

వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం: పైకప్పులేని ఆ ఆలయంలో కనక మహాలక్ష్మి కటాక్షం!

విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీకనక మహాలక్ష్మీ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గానీ, గోపురం గానీ ఉండదు. అంతేకాదు,అమ్మవారికి వామ హస్తం (ఎడమ చేయి) కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు .

వరలక్ష్మీ వ్రతం, దసర పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి రక్షించారని చెబుతారు.

ఇదీ నేపథ్యం: బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై.. తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్టించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. మరో కథనం ప్రకారం.. సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మనుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై.. తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాలని కోరుతుంది. అయితే, ఆ బ్రాహ్మనుడు తాను కాశీకి వెళ్తున్నానని, మన్నించాలని ప్రాదేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామ హస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మనుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మనుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి.. అమ్మవారి వామ హస్తాన్ని మోచేతి పైవరకు ఖండిచి, శాంతిపజేస్తాడు. కనక మహాలక్ష్మీగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే, ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు.

  • August 26 , 2023
  • 11:34 am