రాబోయే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మీదుగా వేడిగాలులు వీచే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణాదిలో ఎండలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ ఇటీవలే వెల్లడించింది.
దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేసింది. ‘బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.. వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చు.. ఉరుములు, పిడుగులు, బలమైన గాలులు వీస్తాయి’ అని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్రా వెల్లడించారు. అయితే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, మహారాష్ట్రలోని కొన్ని చోట్ల ఆదివారం ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే మూడు రోజుల్లో ఒడిశాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, పశ్చిమ్ బెంగాల్‌లో గంగాతీరం, ఒడిశా మధ్యభాగం, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 38 నుంచి 39 డిగ్రీల వరకూ నమోదవుతాయని పేర్కొన్నారు.
‘తమిళనాడు, కేరళ, పశ్చిమ్ బెంగాల్, జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల మినహా దేశంలోని చాలా చోట్ల సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలో తక్కువగానూ ఉన్నాయి.. ఇక్కడ సాధారణం కంటే 1-2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది’ అని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. మరోవైపు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులవల్ల భూతాపం పెరిగిపోతోందని, ఇది దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి నెలలో దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
1901 తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే, పశ్చిమ ప్రాంతాల మీదుగా వీచిన గాలుల మూలంగా మార్చి నెలలో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.