×

అయోధ్య ప్రారంభోత్సవానికి హాజరైన ముస్లిం చీఫ్.. ఆయనకు షాక్ ఇచ్చిన ముస్లిం సంస్థలు ..!

అయోధ్యలో ఈ నెల 22 వ తేదీన జరిగిన రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అపూర్వ ఘట్టంలో తాము కూడా పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన మందిరం కాగా.. ఈ ప్రాణ ప్రతిష్ఠకు పలువురు ముస్లింలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో వారు కూడా వచ్చి అయోధ్య ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయితే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన అఖిల భారత ఇమామ్ ఆర్గనైజేషనన్ చీఫ్‌ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసికి కూడా హాజరు కాగా.. తాజాగా బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనకు ఫత్వా జారీ అయిందని అఖిల భారత ఇమామ్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్‌యాసి తాజాగా పేర్కొనడం సంచలనంగా మారింది.

 

శ్రీరామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన ఇక్బాల్‌ అన్సారీతో పాటు ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్‌యాసికి కూడా రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు అందజేసింది. అయితే తాను ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరైన తర్వాత తనకు తనకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఇల్‌యాసి తెలిపారు. ముఖ్యంగా ఒక వర్గం తనను తీవ్రంగా తిడుతున్నట్లు చెప్పారు. ఇక సోషల్ మీడియా వేదిక ద్వారా తనకు వ్యక్తిగతంగా ఫత్వా కూడా జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన ఫోన్ నంబర్‌ను సేకరించిన దుండగులు దాన్ని సోషల్ మీడియాలో ఉంచారని పేర్కొన్నారు.

 

అన్ని మసీదు అథారిటీలకు, ఇమామ్‌లకు తన ఫోన్ నంబర్‌ను షేర్ చేసి.. తనను బహిష్కరించాలని అందులో పేర్కొన్నారని ఇమామ్ ఇల్‌యాసి చెప్పారు. తాను అయోధ్య ప్రారంభోత్సవానికి హాజరైనందుకు క్షమాపణలు చెప్పాలని.. దాంతోపాటు ఇమామ్ పదవి నుంచి తప్పుకోవాలని ఆ ఫత్వాలో పేర్కొన్నట్లు వివరించారు. ఫత్వా జారీ చేయడానికి కారణం వారికి మాత్రమే తెలుసని తెలిపారు. తనకు రామ జన్మభూమి ట్రస్ట్‌ నుంచి ఆహ్వానం అందిందని.. దాన్ని అంగీకరించి ఆ కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు. అయితే అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అని తాను 2 రోజులు ఆలోచించానని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పుడు తీసుకునే నిర్ణయమే తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం అవుతుందని చెప్పారు. మత సామరస్యం, దేశ మంచి కోసం, జాతి ప్రయోజనాల దృష్ట్యా అయోధ్యకు వెళ్లినట్లు ఇమామ్ ఇల్‌యాసి వెల్లడించారు.

తనకు అయోధ్య ప్రజలు స్వాగతం పలికారని.. తాను వెళ్లడం పట్ల సాధువులు, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారని ఇమామ్ ఇల్‌యాసి గుర్తు చేసుకున్నారు. తాను ప్రేమను పంచడానికే అక్కడికి వెళ్లానని.. అది నెరవేరిందని చెప్పారు. మన ప్రార్థనలు, ఆచారాలు, మతం, కులం, విశ్వాసాలు వేరు కావచ్చు.. కానీ మన అతిపెద్ద మతం మానవత్వమేనని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే క్షమాపణలు చెప్పే అవసరం లేదని తేల్చి చెప్పారు. తనకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఇది భిన్నత్వంలో ఏకత్వం గల సర్వ ధర్మ సంభవ్‌ భారత్‌ అని.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని తెలిపారు. భారత్ విశ్వగురు కావడానికి చేస్తున్న ప్రయాణంలో మనమంతా ఒకటిగా ఉండాలని ఇమామ్ ఇల్‌యాసి పేర్కొన్నారు.

  • January 30 , 2024
  • 10:23 am