×

రష్యాపై ఎదురుదాడికి సిద్ధమైన ఉక్రెయిన్.. ఐరోపా దేశాల్లో జెలెన్‌స్కీ ఆకస్మిక పర్యటన !!

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఆకస్మిక ఐరోపా పర్యటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే అధ్యక్షులతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం జర్మనీలో అడుగుపెట్టిన ఆయన.. ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ స్కాల్జ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి స్వాధీనం చేసుకోడానికి ఎదురుదాడికి దిగుతామని జెలెన్‌స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

 

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. అంతేకాదు, ఆక్రమించుకున్న తమ భూభాగాలను రష్యా నుంచి తీసుకుంటామని, మాస్కోపై దాడి చేసేంత ఆయుధ సంపత్తి, సామర్ధ్యం తమకు లేదని చెప్పారు. తమకు సాయంగా 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 

రష్యా ప్రాంతాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోన్న ఉక్రెయిన్.. తర్వాత శాంతి చర్చల్లో వాటిని బేరసారాలుకు వాడుకోనుందన్న ఊహాగానాలు నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ వివరణ ఇచ్చారు. ఆయన జర్మనీ పర్యటన ముగించుకుని ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. విల్లాకౌబ్లే ఎయిర్ బేస్‌లో జెలెన్‌స్కీకి ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్నే స్వాగతం పలికారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలీసా ప్యాలెస్‌లో ఇమ్యానుయేల్ మెక్రాన్‌ను కలిశారు. ఇరువురి మధ్య గంట పాటు ముఖాముఖి సమావేశమయ్యారు. ఆయనతో కలిసి డిన్నర్ చేసిన జెలెన్‌స్కీ.. మూడు గంటలకుపైగా గడిపారు.

ఇరువురు ఉక్రెయిన్ క్లిష్టమైన అవసరాలు, సైనిక, మానవతావాదం గురించి చర్చించారు. యుద్ధంలో పరిస్థితి ముఖ్యంగా బఖ్‌ముత్‌లో మరింత క్లిష్టంగా మారుతుందని వివరించారు. దీంతో అవసరమైన సైనిక సాయం చేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ‘ఉక్రెయిన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం.. కీవ్ అత్యంత తక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త సాయం సిద్ధం చేస్తున్నాం.. AMX-10RC లతో సహా డజన్ల కొద్దీ సాయుధ వాహనాలు, తేలికపాటి ట్యాంకులను ఫ్రాన్స్ సరఫరా చేస్తుంది. రాబోయే వారాల్లో ఉక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యాలకు మద్దతు ఇచ్చే ప్రయత్నాలు కూడా ప్రణాళికలో ఉన్నాయి.

అటు నుంచి సోమవారం ఉదయం యూకేకు చేరుకున్న జెలెస్కీ.. ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ను కలుసుకున్నారు. రష్యా దళాలను నిలువరించేందుకు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్రూయిజ్‌ క్షిపణులను అందిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి తమకు మద్దతుగా వెన్నుదన్నుగా నిలిచిన యూకేకు ధన్యవాదాలు చెప్పారు. ఉక్రెయిన్‌ను అత్యవసర మద్దతుపై సునాక్‌తో చర్చించనున్నట్టు మీడియాతో అన్నారు.

  • May 16 , 2023
  • 10:50 am