×

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు !

ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో ఈ నెల 8కి ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. తమిళనాడులో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రంపైకి తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారగా.. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి.

బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుంది అంటున్నారు.

నెల్లూరు జిల్లా కందుకూరు 115.6 మిల్లీ మీటర్లు, నెల్లూరు జిల్లా కావలి 101.8, తిరుపతిలో 62, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 61.2, తిరుపతి జిల్లా తడలో 57.8, పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో 54.4, ప్రకాశం జిల్లా ఒంగోలు 47.8, బాపట్ల జిల్లా అద్దంకిలో 45.6, చిత్తూరులో 44.4, కడప జిల్లా రాజుపాలెంలో 42.4, పల్నాడు జిల్లా మాచెర్లలో 43, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 35.8, శ్రీసత్యసాయి జిల్లా నంబులిపులికుంటలో 30.2, చిత్తూరు జల్లా పాలసముద్రంలో 30.2, అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

  • November 07 , 2023
  • 09:26 am