×

భారత్ టార్గెట్‌గా చైనా గూఢచారి బెలూన్‌.. రిపోర్టులో షాకింగ్ విషయాలు !!

అంతర్జాతీయ న్యూస్ ( లలితా పీఠం ) : భారత్‌తోపాటు ఇతర దేశాలను చైనా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలె చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసిన అమెరికా.. రిపోర్టులో షాకింగ్ విషయాలను వెల్లడించింది. చైనా లక్ష్యంగా చేసుకున్న దేశాలకు ముందస్తుగా సమాచారాన్ని అందజేసింది.

ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం రేపుతున్నాయి. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఇన్‌స్టాలేషన్‌లపై తిరుగుతున్న చైనా నిఘా బెలూన్‌ను యూఎస్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ చైనీస్ బెలూన్ కీలక సమాచారాన్ని అమెరికా అధికారులు భారత్‌తో సహా తమ మిత్రదేశాలకు వెల్లడించారు. ఈ బెలూన్‌ను శనివారం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా దక్షిణ కరోలినా తీరంలో ఫైటర్ జెట్ ధ్వంసం చేసింది.

అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి షెర్మాన్ రాయబార కార్యాలయాల అధికారులకు చైనా బెలూన్‌ను ధ్వంసం చేయడంపై సమాచారాన్ని అందించారు. "జపాన్, ఇండియా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌తో సహా అనేక దేశాలలో సైనిక ఆస్తులతోపాటు..  చైనాకు వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ప్రాంతాలలో సమాచారాన్ని సేకరించింది" అని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. రక్షణ, ఇంటెలిజెన్స్ అధికారులతో ఇంటర్వ్యూల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. 

చైనా పీఎల్ఏ వైమానిక దళం పంపించిన ఈ బెలూన్లు 5 ఖండాలలో కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ బెలూన్‌లు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని బెలూన్‌లలో భాగమని.. వీటిని నిఘా కార్యకలాపాలు నిర్వహించేందుకు అభివృద్ధి చేసి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారని ఓ సీనియర్ రక్షణ అధికారి వెల్లడించారు.

  • February 11 , 2023
  • 09:46 am