×

సిగ్నల్ పడినా దూసుకొచ్చిన రైలు.. పాట్‌ఫామ్‌పై మరో ఎక్స్‌ప్రెస్.. చివరకు !!

 

రెడ్ సిగ్నల్ పడినా.. ఆగకుండా స్టేషన్‌ దిశగా కిలోమీటరు ముందుకు దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడ మరో రైలు ఆగి ఉండగా.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆ రైలు అక్కడే ఆగిపోయిది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కలకలం రేపిన ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని భర్జనా రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఢిల్లీ-హౌరా మార్గంలో భర్జనా స్టేషన్‌కు 5 కిలోమీటర్ల ముందు 507 మైలురాయి వద్ద రెడ్ సిగ్నల్ పడింది.

ఈ క్రమంలో ఢిల్లీ-వారణాసి శివగంగ ఎక్స్‌ప్రెస్‌ రైలు సిగ్నల్‌ పడినా ఆగకుండా 80 కి.మీ. వేగంతో వచ్చేస్తోంది. రెడ్ సిగ్నల్‌ను లోకోపైలట్‌లు గమనించకుండా బండిని ముందుకు పోనిచ్చారు. ఆ సమయంలో స్టేషన్‌లో హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగి ఉంది. రైలు రాకను గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఆ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఇద్దరు లోకోపైలట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఘటనపై ఉత్తర మధ్య రైల్వే పీఆర్వో అమిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘కాన్పుర్‌ నుంచి ఢిల్లీ వరకు అత్యంత పటిష్ఠమైన ఆటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ ఉంది. వైఫల్యాలకు అవకాశం ఉండదు. ఉదయం సమయం కావడంతో పొగ మంచు కారణంగా సిగ్నల్‌ గమనించలేకపోయే అవకాశం ఉంది. అయినా లోకోపైలట్లు ఎందుకు అప్రమత్తంగా లేరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.. తప్పు చేసినట్లు తేలితే ఇద్దరు లోకోపైలట్లపైనా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.

కాగా, రెండు రోజుల కిందట ఇటావా సమీపంలోనే హౌరా నుంచి గురుగ్రామ్ వెళ్తోన్న రైల్వే కార్గో కంటైనర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

  • February 02 , 2024
  • 10:37 am