×

ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఏప్రిల్‌లో ఇక మంటలే.. భానుడి భగభగలు మొదలు !!

రాష్ట్రంలో ఎండలు ఇప్పటికే మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధాకరణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపు చాలా జిల్లాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండలకు ప్రజలు బయటకు రావడం తగ్గించేశారు. ఎండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈ నెలలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణలోని చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. తూర్పు తెలంగాణలోని చాలా జిల్లాలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌తో పాటు చాలా జిల్లాల్లో ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

తూర్పు, ఈశాన్య జిల్లాల్లో వేడిగాలులు ఉండొచ్చని, ఏప్రిల్‌లో హీట్‌వేవ్స్ ఉండే అవకాశం తక్కువగా ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వేసవి కాలంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు చెప్పారు. ఇతర జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు.

ఇక హైదరాబాద్‌లో ఈ రోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉరుముల మేఘాలు ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల వరకు నమోదవుతాయని అంచనా వేసింది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కి.మీ గాలి వేగం వీచే అవకాశముందని తెలిపింది.

అటు సోమవారం ఆదిలాబాద్‌లో గరిష్టం 38.3, కనిష్టం 22.5 డిగ్రీలు, భద్రాచలంలో గరిష్టం 36.8, కనిష్టం 26.0, హకీంపేటలో గరిష్టం 34.2, కనిష్టం 22.8, దుండిగల్‌లో గరిష్టం 36.2, కనిష్టం 24.5, హనుమకొండలో గరిష్టం 34.5, కనిష్టం 23.5, హైదరాబాద్‌లో గరిష్టం 35.9, కనిష్టం 25.3 డిగ్రీలు నమోదైంది. ఇక ఖమ్మంలో గరిష్టం 36.6, కనిష్టం 25.2, మహబూబ్‌నగర్‌లో గరిష్టం 38.2, కనిష్టం 24.9 డిగ్రీలు, మెదక్‌లో గరిష్టం 36.2, కనిష్టం 20.8, నల్లగొండలో గరిష్టం 35.0, కనిష్టం 22.0, నిజామాబాద్‌లో గరిష్టం 37.5, కనిష్టం 23.6 డిగ్రీలు, రామగుండంలో గరిష్టం 36.8 డిగ్రీలు, కనిష్టం 25.0 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణశాఖ తన వెదర్ బులిటెన్‌లో పేర్కొంది.

  • April 04 , 2023
  • 10:23 am