×

ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

విశాఖపట్నం ( లలితా పీఠం ) : ఏపీ ప్రజలకు అలర్ట్. ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ.. సోమవారం రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 530 కిలో మీటర్లు.. భారత్‌లోని కరైకల్‌కు తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ వాయుగుండం మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని అంచనా వేస్తున్నారు.

వాయుగుండం దక్షిణ నైరుతి వైపు పయనిస్తుందని.. బుధవారం మధ్యాహ్నానికి శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుందని తెలిపారు. ఈ ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. బుధవారం నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో చలి వాతావరణం కొనసాగుతోంది. అక్కడక్కడా చల్లని గాలులతో పాటూ మంచు కూడా కురుస్తోంది.

  • January 31 , 2023
  • 10:39 am