అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. దేశ నలు మూలల నుంచి అయోధ్య రాముడి ఆశీస్సుల కోసం ఆలయానికి పోటెత్తుతున్నారు. అయితే భవ్య రామ మందిరంలో కొలువైన బాల రాముడికి కొత్త పేరు పెట్టినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య ఆలయానికి కూడా కొత్త పేరు పెట్టినట్లు వెల్లడించింది. ఇక నుంచి అయోధ్య బాలరాముడిని బాలక్ రామ్‌గా.. అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలవనున్నట్లు పేర్కొంది.
అయోధ్య బాలరాముడికి బాలక్ రామ్‌గా, ఆలయానికి బాలక్ రామ్ మందిరంగా నామకరణం చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ఇక అయోధ్యలో టెంటులో ఉన్న పాత రామ్ లల్లా విగ్రహం గురించి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. గతంలో చెప్పిన విధంగానే రాముడి పాత విగ్రహాన్ని గర్భగుడిలోని బాలక్ రామ్ విగ్రహానికి ఎదురుగా ఉండేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.