లలితా పీఠం విశాఖపట్నం న్యూస్ : భారతీయ ఫార్మ సంస్థ తయారుచేసిన ఐడ్రాప్స్‌లోని హానికారక బ్యాక్టీరియాపై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ముగ్గురు చనిపోగా.. ఎనిమిది మంది శాశ్వతంగా కంటి చూపును కోల్పోగా, డజన్ల కొద్దీ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డారు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఐడ్రాప్స్‌తో ముడిపడి ఉన్న అత్యంత ఔషధ-నిరోధక బ్యాక్టీరియా అమెరికాలో పట్టు సాధించవచ్చని సీడీసీ కలవరపడుతోంది.
ఈ స్ట్రెయిన్ ఇంతకు ముందు అమెరికాలో గుర్తించలేదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా కష్టమని ఇన్‌ఫక్టియస్ డిసీజ్ నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో పలు కేసులు బయటపడటంతో అమెరికా మార్కెట్‌లో ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్‌ను రీకాల్ చేస్తున్నట్లు గ్లోబల్ ఫార్మ వెల్లడించింది. ఈ క్రమంలో ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్, డెల్సామ్ ఫార్మా ఆర్టిఫిషియల్ టియర్స్‌ను స్థాయిలో స్వచ్ఛందంగా రీకాల్ చేసింది.
గతేడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో భారతీయ కంపెనీ తయారుచేసిన దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మరణించిన ఘటనపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, భారత్‌లో తయారైన ఐడ్రాప్స్‌లో బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించడం గమనార్హం. ఈ ఐడ్రాప్స్ ఉపయోగించడం వల్ల కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుందని, అది అంధత్వం లేదా మరణానికి దారితీయవచ్చని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
సూడోమోనాస్ ఎరుగినోసా బ్యాక్టీరియా.. రక్తం, ఊపిరితిత్తులు లేదా గాయాలలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కారణంగా ఇటీవలి కాలంలో చికిత్స చేయడం కష్టతరంగా ఉంది. ‘ఎజ్రీకేర్ లేదా డెల్సామ్ ఫార్మ ఐడ్రాప్స్ ఉపయోగించిన రోగులు, కంటి ఇన్ఫెక్షన్ సంకేతాలు, లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి’ సీడీసీ సూచించింది. ఈ మందును వాడిన తర్వాత రక్తం, మూత్రం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కనిపించినట్లు సీడీసీ వెల్లడించింది. దీని వాడకాన్ని నిలిపివేయాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆదేశాలు జారీ చేసింది.