×

అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం.. యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నాలు: అమెరికా కీలక తీర్మానం !!

 

అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో అంతర్భాగంగా భావించే సెనేట్‌ ద్వైపాక్షిక తీర్మానం ప్రకారం.. మెక్‌మహన్ రేఖను చైనా, భారత్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా అమెరికా గుర్తించింది. ‘‘ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛకు చైనా ముప్పు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలోని మా వ్యూహాత్మక భాగస్వాములతో ముఖ్యంగా భారతదేశంతో అమెరికా భుజం భుజం కలిపి నిలబడటం చాలా కీలకం’ అని సెనేటర్ జెఫ్ మెర్ల్కీతో కలిసి సెనేట్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హాగర్టీ వ్యాఖ్యానించారు.

‘‘ఇండో ఫసిపిక్‌లో స్వేచ్ఛకు మద్దతుగా ఈ ద్వైపాక్షిక తీర్మానం వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి యధాతథ స్థితిని మార్చేందుకు చైనా సైనిక దురాక్రమణను ఖండిస్తుంది.. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని నిస్సందేహంగా గుర్తించేందుకు సెనేట్ మద్దతును తెలియజేస్తోంది’’ అని మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానంలో హాగర్టీ అననారు.

భారత్, చైనా మధ్య ఆరేళ్లలో వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు సెక్టార్‌లో జరిగిన అతిపెద్ద ఘర్షణ చోటుచేసుకున్న తర్వాత ఈ తీర్మానం రావడం గమనార్హం. చైనా, భారత్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా అరుణాచల్ ప్రదేశ్‌లోని మెక్‌మహన్ రేఖను యునైటెడ్ స్టేట్స్ గుర్తిస్తుందని పునరుద్ఘాటించింది. అంతేకాదు, అరుణాచల్‌ను తమ భూభాగమని చైనా చేస్తోన్న వాదనలను ఈ తీర్మానం వ్యతిరేకించింది. చైనా దూకుడు, విస్తరణ విధానాలలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌ను తన ప్రాంతంగా చెబుతోందని పేర్కొంది.

‘అమెరికా విలువలు స్వేచ్ఛకు మద్దతునిస్తాయి.. నియమాల ఆధారిత క్రమం ప్రపంచవ్యాప్తంగా మా అన్ని చర్యలు, సంబంధాలలో తప్పనిసరిగా ఉండాలి ప్రత్యేకించి పీపుల్స్ రిపబ్లిక్ చైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ దృష్టిని ముందుకు తెస్తుంది’ అని మెర్ల్కీ చెప్పారు. ‘‘భారతీయ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ గణతంత్ర భారత్‌లో భాగమని, పీఆర్సీకి సంబంధించింది కాదని ఈ తీర్మానం స్పష్టం చేస్తోంది..సారూప్యత కలిగిన అంతర్జాతీయ భాగస్వాములు, దాతలతో పాటుగా ఈ ప్రాంతానికి మద్దతు, సహాయాన్ని మరింతగా పెంచడానికి అమెరికా కట్టుబడి ఉంది’ అని ఆయన అన్నారు.

వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌, భూటాన్‌లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సైనిక బలగాలను ఉపయోగించడం, వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, నగరాల కోసం మాండరిన్ భాషా పేర్లతో మ్యాప్‌లను ప్రచురించడం వంటి డ్రాగన్ కవ్వింపు చర్యలను ద్వైపాక్షిక సెనేటర్ల తీర్మానం ఖండిస్తోంది.

అంతేకాకుండా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దూకుడు, భద్రతా బెదిరింపులకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యలను తీర్మానం ప్రశంసించింది. ఈ ప్రయత్నాలలో భారత్ టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సురక్షితం చేయడం; సరఫరా గొలుసులను పరిశీలించడం; పెట్టుబడి స్క్రీనింగ్ ప్రమాణాలను అమలు చేయడం; ప్రజారోగ్యం, ఇతర రంగాలలో తైవాన్‌తో తన సహకారాన్ని విస్తరించడం వంటివి ప్రస్తావించింది

  • March 21 , 2023
  • 11:00 am